ప్రమాదంలో ఆదివాసీ భాషలు!
..............................................................
మనం ఆదివాసీల హక్కులు, అడవులు, జీవన విధానం గురించి మాట్లాడుతుంటాం. కానీ అత్యంత విలువైన వారి వారసత్వమైన మాతృభాష గురించి మాత్రం తక్కువగా ఆలోచిస్తాం. ఒక భాష కేవలం సంభాషణ సాధనం కాదు. అది ఒక జాతి చరిత్ర, సంస్కృతి, జానపద విజ్ఞానం, ప్రకృతి పరిజ్ఞానం, జీవన తత్వాన్ని మోసుకెళ్లే సజీవ సంపద. అందుకే ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో పాటు ఒక ప్రపంచ దృష్టికోణం కూడా శాశ్వతంగా కనుమరుగవుతుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో నివసించే కోయల మాతృభాష అయిన కోయ నేడు సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామాల్లో పెద్దలు ఇప్పటికీ కోయలో మాట్లాడుతున్నప్పటికీ, కొత్త తరం విద్య, ఉపాధి, పట్టణీకరణ ప్రభావంతో తెలుగు, హిందీ లేదా ఆంగ్ల భాషల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోంది. ఇంట్లోనే మాతృభాష వినిపించని పరిస్థితి ఏర్పడితే, ఆ భాషకు భవిష్యత్తు మరింత సంక్లిష్టమవుతుంది.
భాషా శాస్త్రవేత్తలు చాలాకాలంగా ఒక విషయాన్ని చెబుతున్నారు. భాష నిలవాలంటే అది ఇంట్లో మాట్లాడాలి, పిల్లలకు నేర్పాలి, పాఠశాలల్లో వినిపించాలి. కేవలం పండుగలు జరపడం లేదా సదస్సులు నిర్వహించడం సరిపోదు. రోజువారీ జీవితంలో భాషకు స్థానం ఉంటేనే అది జీవిస్తుంది.
‘ గిరిజనేతరులు మా ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాల వల్ల వారి భాష మాపై ప్రభావం చూపడం వల్ల మా కోయ భాష కనుమరుగు అయ్యే ప్రమాదం ఏర్పడింది. మాకు వీలైనంతలో భాషను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పపూవుతో చాక్లెట్లు,లడ్డూలు చేస్తున్నాం. ఈ ఉత్పత్తులకు ‘పుంగార’ అనే పేరు పెట్టాము. పుంగార్ అంటే మా కోయభాషలో పువ్వు అని అర్ధం.’ అని చెప్పారు భద్రాచలంకు చెందిన స్వయం సహాయక సంఘ మహిళ సమ్మక్క.
ఇది కేవలం కోయ భాష సమస్య మాత్రమే కాదు. భారతదేశంలో అనేక ఆదివాసీ భాషలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. యునెస్కో ప్రమాదంలో ఉన్న భాషల జాబితాలో భారతదేశానికి చెందిన అనేక భాషలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన కుపియా, గదబ, కొలామి, కోంధ్ తోటి, చెంచు భాషా రూపాలు, అలాగే అండమాన్ దీవులలోని గ్రేట్ అండమానీస్, ఒంగే వంటి భాషలు కూడా మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోవడంతో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి భాష వెనుక ఒక ప్రత్యేక ప్రపంచం దాగి ఉంది.
ఆదివాసీ భాషలు అంతరించిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పట్టణాలకు వలసలు, మాతృభాషలో విద్య లేకపోవడం, ప్రభుత్వ వ్యవహారాల్లో స్థానిక భాషలకు తగిన ప్రాధాన్యం లేకపోవడం, ఉద్యోగ అవకాశాల కోసం ఆధిపత్య భాషలను ఎంచుకోవడం, తల్లిదండ్రులే పిల్లలతో మాతృభాషలో మాట్లాడకపోవడం వంటి అంశాలు కలిసి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి. భాషను కోల్పోవడం అనేది ఒక్కసారిగా జరిగే సంఘటన కాదు; ప్రతి తరం కొద్దికొద్దిగా దూరమవుతూ చివరకు ఆ భాష మాట్లాడేవారు లేకుండా పోతారు. ఇలాంటి సమస్యలకు తనవంతు పరిష్కారం చూపారు ఒక పాలనాధికారి
2020లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన దివ్యదేవరాజన్ అక్కడి గోండుల సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా ఒక ట్యూటర్ని నియమించుకొని గోండు భాషను నేర్చుకున్నారు. ఆదివాసీ గూడేల్లో వారి అరుగుల మీద కూర్చొని వారి భాషలోనే ఆమె మాట్లాడుతున్నపుడు వారంతా వారి కష్టాలన్నీ ధైర్యంగా చెప్పుకునేవారు.
..........................................
దివ్య లాంటి అధికారులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం ఉంది.
ఆంధ్ర,ఒడిశా సరిహద్దుల్లో ఉన్న సొలభం గ్రామంలో కోంధ్ ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. వారికి తెలుగు రాదు. వారి సమస్యలు అధికారులకు చెప్పుకునే అవకాశం లేక వృద్ధులు పెన్షన్లు పొందలేక పోవడం మా ఫీల్డ్ విజిట్లో గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు సమస్య తీరలేదు.
ఆదివాసీ పిల్లలకు మంచి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంత అవసరమో, అంతే అవసరం వారిలో మాతృభాషపై గౌరవాన్ని పెంపొందించడం. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. కానీ వాటిని నేర్చుకునే క్రమంలో వారి భాషను మరచిపోవడం మాత్రం ఒక సాంస్కృతిక నష్టంగా మిగిలిపోతుంది.
ఒక వ్యక్తి రెండు, మూడు భాషలు మాట్లాడగలడు; అందులో మాతృభాషకు మొదటి స్థానం ఉండాలి. ప్రభుత్వాల పాత్ర కూడా ఇక్కడ కీలకం. ఆదివాసీ ప్రాంతాల్లో మాతృభాష ఆధారిత ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, వారి భాషలో పాఠ్యపుస్తకాలు, నిఘంటువులు, డిజిటల్ కంటెంట్ రూపొందించడం, భాష తెలిసిన ఉపాధ్యాయులను నియమించడం, జానపద గేయాలు, కథలు, సామెతలను డిజిటల్ రూపంలో భద్రపరచడం వంటి చర్యలు అత్యవసరం. భాషను కేవలం మ్యూజియంలో ఉంచే వారసత్వంగా కాకుండా, నిత్యజీవితంలో వినిపించే భాషగా నిలబెట్టాలి.
అయితే బాధ్యత ప్రభుత్వాలదే కాదు. ప్రతి ఆదివాసీ కుటుంబం తమ పిల్లలతో ఇంట్లో తమ భాషలో మాట్లాడటం, పెద్దల కథలను వినిపించడం, పండుగలు, సంప్రదాయాల ద్వారా భాషను తరతరాలకు అందించడం అత్యంత ప్రభావవంతమైన సంరక్షణ చర్య. భాష పుస్తకాలలో కాదు, కుటుంబాలలో బతుకుతుంది.